నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి - అధికారులకు ఎగువ కొనకొంట్లవారిపల్లె గ్రామస్తులు విజ్ఞప్తి - దుశ్చర్యకు ఒడిగట్టిన కొందరు స్థానికులు మదనపల్లె : గ్రామాల్లో నెలకొన్న చిన్న చిన్న సమస్యల నడుమ స్థానికంగా ఉన్న కొందరు మదనపల్లె మండలం,వేంపల్లె పంచాయతి,ఎగువకొనకుంట్ల వారిపల్లె గ్రామానికి దారి లేకుండా 20 రోజులుగా రోడ్డుకు అడ్డంగా మట్టితోలి దారిని పూర్తిగా మూసేశారు.దీంతో గ్రామంలోని 29 కుటుంబాలు ప్రజలు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ముఖ్యంగా రోగులు ఆసుపత్రికి వెళ్లాలన్నా,విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్నా,రైతులు వ్యవసాయ పొలాలకు వెళ్లాలన్నా,వ్యవసాయ పొలాల నుంచి ధాన్యం,గడ్డి,వ్యవసాయ పనిముట్లు,తదితర వస్తువులు ఇళ్లకు,పొలాలకు తరలించుకోవాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.దారిని తెరవాలని అడిగితే స్థానికంగా గొడవలకు దిగి,దుర్భాషలాడుతూ,ఘర్షణలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు.వారిని ఎదిరించే శక్తి మాకు లేదని అధికారులకు,పోలీసులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి దారిని మూసేసిన వారిపై చర్యలు తీసుకొని వెంటనే దారి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.ఈ విషయమై తహశీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డిని వివరణ కోరగా పంచాయతీ సెక్రటరీ,వీఆర్వోలను సంఘటనా స్థలానికి పరిశీలనకై పంపామని,అయినా వారు దారికి అడ్డుగా వేసిన మట్టిని తొలగించలేదన్నారు.కాబట్టి వారిపై కేసు నమోదు చేయమని తాలూకా పోలీసులను కోరడం జరిగిందన్నారు.మూసేసిన దారిని వెంటనే తెరవకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Reporter
Namitha News