నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వాల్మీకిపురం : వాల్మీకి పురం పీవీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య పుస్తకాల విషయంలో జరిగిన గొడవ తీవ్ర ఘటనకు దారితీసింది. మండలంలోని గొల్లపల్లికి చెందిన విద్యార్థి హర్షవర్ధన్ పుస్తకాలను పట్టణానికి చెందిన విద్యార్థి భరత్‌రాజ్ దొంగిలించినట్లు సమాచారం. ఈ విషయమై భరత్ రాజ్ ను హర్షవర్ధన్ నిలదీయడంతో ఇద్దరి మధ్య మంగళవారం వాగ్వాదం జరిగింది. బుధవారం ఉదయం భరత్‌రాజ్ రూ.5 వెచ్చించి చిన్న చాకును కొనుగోలు చేసి పాఠశాలకు తీసుకువచ్చాడు. హర్షవర్ధన్ రానీ ఈరోజు వాడి కథ చూస్తానంటూ తోటి విద్యార్థుల వద్ద హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. అనంతరం తరగతి గదిలోకి వచ్చిన హర్షవర్ధన్ పుస్తకాలు కింద పెట్టేందుకు వంగిన సమయంలో భరత్‌రాజ్ చాకుతో హర్షవర్ధన్ మెడపై బలంగా కోశాడు. దీంతో హర్షవర్ధన్ తీవ్రంగా గాయపడి రక్తస్రావం అయ్యింది. అప్రమత్తమైన ఉపాధ్యాయులు, విద్యార్థులు అతడిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెడపై దాదాపు 8 కుట్లు వేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాధిత విద్యార్థి చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై బాధితుడి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
Reporter
Namitha News