నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - నవంబర్ 25 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు బి.టెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మీనాక్షి ఎలక్ట్రిక్ వాహనాల "ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ బేసెడ్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ " అనే అంశంపై చేసిన పరిశోధనకు ప్రతిష్టాత్మకమైన ఎలక్ట్రికల్ ఇండియా మ్యాగజిన్ లో ప్రచురించబడినట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. ఈ సందర్బంగా విభాగాధిపతి డాక్టర్ ఎ.వి పవన్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, విభిన్న బ్యాటరీ సెల్స్‌తో కూడిన బ్యాటరీ ప్యాక్లను సమర్థవంతంగా నిర్వహించడం అత్యంత కీలకం అని, వాడిన లేదా ఎక్కువ రోజులు అయిన తేడా గల సెల్స్‌ను ఒకే బ్యాటరీ ప్యాక్‌లో కలపడం వల్ల బ్యాటరీ పనితీరు తగ్గిపోవడం, విద్యుత్ వినియోగ సామర్థ్యం తగ్గడం, భద్రతా సమస్యలు ఉత్పత్తి కావడం వంటి ప్రమాదాలు ఉన్నాయని పరిశోధనలో పేర్కొన్నారు. ఇలాంటి మిశ్రమ సెల్స్ వోల్టేజ్ మరియు వేడి పంపిణీలో అసమతుల్యతను కలిగించడమే కాక, బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (BMS) ను నియంత్రించడం క్లిష్టమవుతుందని అన్నారు. ఈ పరిశోధనలో బ్యాటరీ యొక్క స్టేట్ ఆఫ్ హెల్త్ ను అంచనా వేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారిత మోడల్‌ను ప్రతిపాదించడం ద్వారా బ్యాటరీ వోల్టేజ్, కరెంట్, ఫాస్ట్ ఛార్జింగ్, బ్యాటరీ భద్రత, వారంటీ, వాడిన బ్యాటరీల రీయూజ్ వంటి అంశాలపై విలువైన సమాచారాన్ని అందించినట్లు తెలిపారు. ఈ పరిశోధన ఎలక్ట్రిక్ వాహనాల టెక్నాలజీ మరియు బ్యాటరీ మేనేజ్‌మెంట్ రంగాలలో కొత్త అధ్యయనానికి దారితీయగలదని పేర్కొన్నారు. అదనంగా, ఈ మోడల్‌ను లిథియం ఐరన్ ఫాస్ఫేట్ మరియు నికెల్-మాంగనీస్-కోబాల్ట్ వంటి వివిధ రసాయన కణాల మీద అమలు చేయడం ద్వారా సంక్లిష్ట పరిశోధనా నమూనాలు మరియు వాస్తవ ఇంజినీరింగ్ పరిష్కారాల మధ్య దూరాన్ని తగ్గించి, ఎక్కువ కాలం నిలిచే ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలకు మార్గం సుగమం చేస్తుందని వివరించారు. ఈ పరిశోధనకు సహాయసహకారాలు అందించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాస్ మరియు విద్యార్థిని మీనాక్షిలను యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు.
Reporter
Namitha News