నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 19 : అన్నమయ్య జిల్లా లోని మదనపల్లి సమీపంలోని ప్రకృతివనం లో నిర్వహించిన ఇషా గ్రామోత్సవాలు ఘనంగా ముగిశాయి. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, మహిళల్లో ఐక్యత, ఆత్మవిశ్వాసాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా గ్రామోత్సవాల రెండవ రోజు గ్రామీణ మహిళల కోసం త్రో బాల్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో సుమారు 12 గ్రామాల నుంచి అధిక సంఖ్యలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు . క్రీడాస్ఫూర్తితో జరిగిన ఈ పోటీలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ రాధిక, విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి నిషిత చేతు , ప్రకృతి వనం వ్యవస్థాపకురాలు శ్రీమతి యోగితా ప్రసాద్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, ఇషా గ్రామోత్సవాలు గ్రామీణ మహిళల్లో ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రీడాస్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు మరియు సామాజిక ఐక్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పోటీల్లో విజేతలకు అభినందనలు తెలియజేస్తూ, పాల్గొన్న ప్రతి మహిళ విజేతేనని అతిథులు కొనియాడారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన నిర్వాహకులు, స్వచ్ఛంద కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు పాల్గొన్న మహిళలందరికీ కృతజ్ఞతలు తెలిపారు
ఈ గ్రామోత్సవాలు గ్రామీణ మహిళల్లో ఉత్సాహాన్ని నింపడమే కాకుండా, గ్రామాల మధ్య స్నేహభావం, ఐక్యతను మరింత బలోపేతం చేస్తూ విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమం లో ఇషా ప్రతినిధులు డాక్టర్ జి అజ్మతుల్లా ఖాన్, ఐశ్వర్య, కిషోర్, అశోక్, హర్షిత, దామోదర్ పాల్గొన్నారు
Reporter
Namitha News