నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె -మే 30 : మదనపల్లి సమీపంలో గల అంగళ్ళు వద్ద గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీలోని మెకానికల్, ఈసీఈ మరియు ఈఈఈ విభాగాల విద్యార్థుల కోసం ఆటోమొబైల్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ASDC), న్యూఢిల్లీ మరియు ఐచర్ మోటార్స్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక సాంకేతిక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జాతీయ విద్యా విధానం (NEP) అమలు కార్యక్రమంలో భాగంగా ఐచర్ మొబైల్ ట్రైనింగ్ వ్యాన్ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఆధునిక వ్యాపార సంబంధిత వాహన సాంకేతికతలు, BS-VI ఇంజిన్ వ్యవస్థలు, వాటి పనితీరు, సాంకేతిక లోపాల గుర్తింపు విధానాలు, నిర్వహణ పద్ధతులు మరియు పరిశ్రమలో ప్రస్తుతం అమలవుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై సమగ్ర అవగాహన కల్పించారు. ఐచర్ అర్ సి డి సి , మైసూర్‌కు చెందిన టెక్నికల్ ట్రైనర్ హెచ్.ఎస్. శశాంక్ శిక్షణను నిర్వహించి, ఐచర్ వాహనంలోని ఇంజిన్ నిర్మాణం, దాని పనితీరు, ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ వ్యవస్థల పని విధానాన్ని ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా వివరించడంతో పాటు పరిశ్రమ అవసరాలు, ఉద్యోగ అవకాశాలు మరియు నైపుణ్యాభివృద్ధి ప్రాముఖ్యతపై విద్యార్థులకు విలువైన సూచనలు అందించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కమల్ బాషా మాట్లాడుతూ, సాంకేతిక రంగంలో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు కొత్త సాంకేతికతలను నేర్చుకోవడంపై ప్రత్యేక ఆసక్తి కనబరచాలని, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా మెరుగైన ఉద్యోగ అవకాశాలను సొంతం చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులలో ప్రయోగాత్మక జ్ఞానాన్ని పెంపొందించి, అకాడెమిక్ అభ్యాసాన్ని పరిశ్రమ అవసరాలతో అనుసంధానం చేయడంలో ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. కార్యక్రమంలో మెకానికల్ విభాగాధిపతి డాక్టర్ ఎస్. భాస్కరన్, ఈఈఈ విభాగాధిపతి డాక్టర్ మనివాలన్ గుణశేఖరన్, ఈసీఈ ఇంచార్జి విభాగాధిపతి డాక్టర్ సతీష్,అసిస్టెంట్ డైరెక్టర్ -ఇండస్ట్రీ రిలేషన్స్ డాక్టర్ పి.ఎం. బాలాజీ, కోఆర్డినేటర్లు డాక్టర్ ప్రవీణ్, పి.ఎం.డి. రిజ్వాన్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News