నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తాగునీటి సమస్య పరిష్కారానికి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలి మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా విశాలాంధ్ర, మదనపల్లి: మదనపల్లె పట్టణంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఏర్పడిన తాగునీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం మున్సిపల్ కమిషనర్, అధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన, పట్టణంలోని అన్ని కాలనీలకు అవసరమైన మేర నీటిని సమీప జలవనరుల నుంచి ట్రాక్టర్లు, ట్యాంకర్ల ద్వారా తరలించి ప్రజలకు అందేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా సీటీఎం రోడ్డు విస్తరణ పనులపై కూడా ఎమ్మెల్యే సమీక్షించారు. టెండర్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో సుమారు 50 సంవత్సరాల క్రితం నిర్మించిన డ్రైనేజీ కాలువను సర్వే చేసి, అవసరమైన సాంకేతిక చర్యలు పూర్తి చేసిన అనంతరం రోడ్డు విస్తరణ పనులను వేగవంతంగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేలా సంబంధిత బీఎల్‌ఓలకు అవసరమైన సూచనలు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్‌ను ఎమ్మెల్యే కోరారు. సమావేశంలో డీఈ శ్రావణి, ఏఈలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News