నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు జూలై 01 : పుంగనూరు స్థానిక మార్కెట్ యార్డులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బుధవారం మీడియా సమావేశం నిర్వహించి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇటీవల తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మామిడి రైతులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నారని చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని వారు అన్నారు. ఈ సందర్బంగా మార్కెట్ కమిటీ చైర్మన్ శమీపతి యాదవ్ మాట్లాడుతూ..గత ఏడాది మామిడి రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.190 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. రైతులకు కిలో మామిడిపై రూ.4 సబ్సిడీ అందిస్తున్న విషయాన్ని పెద్దిరెడ్డి గుర్తుంచుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో చౌడేపల్లి, సోమల, దామలచెరువు ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న మామిడి మండీలను బలవంతంగా తొలగించారని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు సమీపంలోనే మామిడి మార్కెట్లను ఏర్పాటు చేసి, తమ పంటకు మెరుగైన ధర లభించేలా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. మామిడి రైతులకు అన్యాయం చేసింది ప్రస్తుత ప్రభుత్వం కాదని, గత ప్రభుత్వమే రైతుల ప్రయోజనాలను విస్మరించిందని టీడీపీ సీనియర్ నాయకులు మాధవరెడ్డి,సి.వి.రెడ్డి పేర్కొన్నారు. ఇకనైనా మామిడి రైతులను తప్పుదోవ పట్టించేలా అసత్య ఆరోపణలు,ధర్నాలు, రాస్తారోకోలు, తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వారు సూచించారు. వాస్తవాలు ప్రజలకు తెలుసని, ఇటువంటి రాజకీయ ఆరోపణలను ప్రజలు విశ్వసించరని వారు స్పష్టం చేశారు
Reporter
Namitha News