నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 29 : జిల్లాలో వివిధ ఇంజనీరింగ్ శాఖల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మదనపల్లి కలెక్టరేట్‌లోని కోర్టు హాలులో ఇంజనీరింగ్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయా శాఖల పనుల పురోగతి, పెండింగ్ అంశాలు, ఎదురవుతున్న సమస్యలపై అధికారులతో సమగ్రంగా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో సాగునీరు, తాగునీరు, రహదారులు, విద్యుత్, సంక్షేమ భవనాల నిర్మాణం వంటి మౌలిక వసతుల అభివృద్ధిలో ఇంజనీరింగ్ శాఖల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తే అభివృద్ధి పనులు వేగంగా పూర్తై ప్రజలకు త్వరగా ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఇరిగేషన్ శాఖ పరిధిలో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఫేజ్-2లో నీవా బ్రాంచ్ కాలువ ఆధునీకరణ పనుల పురోగతిని సమీక్షించారు. కాలువ ఆధునీకరణ, బ్యాలెన్స్ పనులు, నిర్మాణాలు, కాలువ లైనింగ్ తదితర అంశాలపై అధికారులు వివరించారు. భూసేకరణ, సాంకేతిక అనుమతులు, టెండర్ ప్రక్రియలను వేగవంతం చేసి రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జలధార – జలహారతి కార్యక్రమం కింద ఫీడర్ ఛానల్ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖల పరిధిలో గ్రామీణ తాగునీటి సరఫరా, పైప్‌లైన్ నెట్‌వర్క్, సమ్మర్ కంటింజెన్సీ పనుల పురోగతిని సమీక్షించారు. వేసవికాలంలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అవసరమైనచోట ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని సూచించారు. జల్ జీవన్ మిషన్, అమృత్ 2.0 పథకాల కింద చేపట్టిన వాటర్ సప్లై అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు
మదనపల్లి, పుంగనూరు, బి.కొత్తకోట తదితర పట్టణాల్లో అమృత్ 2.0 కింద చేపట్టిన నీటి సరఫరా, పంపింగ్ మెయిన్‌లు, ఓహెచ్‌ఎస్‌ఆర్‌లు, పంప్ హౌస్‌లు, పంపిణీ నెట్‌వర్క్ పనుల పురోగతిని అధికారులు వివరించారు. మదనపల్లిలో చిప్పిలి వాటర్ సప్లై స్కీమ్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ కింద మున్సిపాలిటీల్లో నిర్మిస్తున్న మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ (ఎంఆర్ఎఫ్) ప్లాంట్ల పురోగతిని కూడా సమీక్షించారు. ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను మరింత బలోపేతం చేసి పట్టణాల్లో పరిశుభ్రతను మెరుగుపరచాలని సూచించారు. ఏపీఈడబ్ల్యూఐడీసీ పరిధిలో సంక్షేమ శాఖలకు చెందిన హాస్టళ్లు, పాఠశాల భవనాలు, గర్ల్స్ హాస్టళ్లు, సైనిక్ స్కూల్, మైనారిటీ వెల్ఫేర్, పాలిటెక్నిక్ హాస్టళ్లు తదితర నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. పూర్తికాని పనులను త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. బిల్లుల పెండెన్సీ, స్థల సమస్యలు, కాంట్రాక్టు అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. ఏపీఎస్పీడీసీఎల్ మరియు ట్రాన్స్‌కో పరిధిలో విద్యుత్ సరఫరా, వ్యవసాయ కనెక్షన్లు, సోలార్ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల బలోపేతం అంశాలపై సమీక్షించారు. ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడంతో పాటు, రైతులకు ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్ అందించాలని కలెక్టర్ ఆదేశించారు
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ… అభివృద్ధి పనుల విషయంలో నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. ప్రతి శాఖ పనులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, అవసరమైతే ఉన్నతస్థాయికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. వర్షాకాలానికి ముందే రహదారులు, భవనాలు, తాగునీటి, డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ ఇంజనీరింగ్ శాఖల జిల్లా అధికారులు, ఇంజనీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News