నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 21 : మదనపల్లె సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో జూన్ 21న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. “ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా (Yoga for Healthy Ageing–2026)” అనే ఇతివృత్తంతో ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ విభాగం, యోగా అండ్ మెడిటేషన్ క్లబ్ మరియు సాక్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మదనపల్లె, సత్ సంగ్ ఫౌండేషన్‌కు చెందిన యోగా ట్రైనర్ ప్రణయ్ మరియు ఆయన బృందం పాల్గొని యోగా, ధ్యాన సాధనలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథం పాల్గొని, యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప వారసత్వమని, దానిని రోజువారీ జీవనశైలిలో భాగంగా చేసుకోవడం ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, భావోద్వేగ సమతుల్యతతో పాటు ఆధ్యాత్మిక వికాసం కూడా సాధ్యమవుతుందని తెలిపారు. భారత ప్రధానమంత్రి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “యోగాంధ్ర–2026” కార్యక్రమంలో భాగంగా జూన్ 21 న యూనివర్సిటీ ప్రాంగణములో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. యూనివర్సిటీ యోగా ట్రైనర్ మరియు ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ సి. దామోదరన్ మాట్లాడుతూ యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యం, క్రమశిక్షణ, ఏకాగ్రత మరియు సంతులిత జీవనానికి మార్గదర్శకమని వివరించారు. అనంతరం ప్రణయ్ మరియు ఆయన బృందం సూర్య నమస్కారాలు, వివిధ యోగాసనాలు, ప్రాణాయామం, శ్వాస వ్యాయామాలు మరియు ధ్యాన ప్రక్రియలను ప్రదర్శించి విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందితో కలిసి సాధన చేయించారు. ప్రత్యేక ధ్యాన కార్యక్రమం ద్వారా ఒత్తిడి నియంత్రణ, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందించుకునే మార్గాలను వివరించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ పి. రాజేష్, మంజు విక్రమ్, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగ సభ్యులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, యెన్ ఎస్ ఎస్ మరియు యెన్ సి సి విద్యార్థులు పాల్గొని యోగా సాధన చేశారు
Reporter
Namitha News