నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : టీడీపీ కండువా వేసుకుంటేనే ట్రాన్స్‌ఫార్మర్ పెడతామంటున్నారు పీజీఆర్ఎస్ అర్జీలకు దిక్కే లేదని సీపీఐ ఆగ్రహం సర్పంచ్ అనుమతి తీసుకురావాలని, టీడీపీ పార్టీ కండువా వేసుకుంటేనే ట్రాన్స్‌ఫార్మర్ వెంటనే ఫిట్ చేయిస్తామని స్థానిక నాయకులు బెదిరిస్తున్నారని సీపీఐ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి కే. మురళి ఆరోపించారు. గాలివీడు మండలం దానంరెడ్డిగారిపల్లి పంచాయితీకి చెందిన రైతు పుల్లారెడ్డికి వెంటనే కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్‌లో జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కే. మురళి మాట్లాడుతూ గత ఏడాదిన్నర కాలంగా రైతు పుల్లారెడ్డి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్ కోసం ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించినప్పటికీ, ట్రాన్స్‌ఫార్మర్ శాంక్షన్ అయినా కూడా రైతు పొలంలో ఫిట్ చేయలేదన్నారు. విద్యుత్ అధికారులను ప్రశ్నిస్తే స్థానిక సర్పంచ్ అనుమతి తీసుకురావాలని చెబుతున్నారని, సర్పంచ్‌ను సంప్రదిస్తే “మా పార్టీ కండువా వేసుకుంటే వన్‌డేలో ట్రాన్స్‌ఫార్మర్ ఫిట్ చేయిస్తాం, లేకపోతే పని జరగదు” అని సమాధానం ఇస్తున్నారని ఆరోపించారు ఈ సమస్యపై ఇప్పటికే మార్చి నెలలో పీజీఆర్ఎస్‌లో కలెక్టర్‌కు అర్జీ ఇచ్చామని, మూడు నెలలు గడిచినా ఇప్పటివరకు సంబంధిత అధికారులు స్పందించలేదన్నారు. దీంతో మళ్లీ స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయాల్లో ప్రజలు ఎంతో ఆశతో అర్జీలు ఇస్తున్నా అధికారులు వాటిని చెత్తబుట్టలో వేస్తున్నారే తప్ప ప్రజా సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి కనిపించడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీజీఆర్ఎస్ వల్ల ప్రజలకు న్యాయం జరగడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజలకు తక్షణ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి మాధవ్ కుమార్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News