నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 16 : సాగునీటి వ్యవస్థ మెరుగుదలకు ఫీడర్, సప్లై చానళ్లలో డీసిల్టింగ్ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం మదనపల్లి కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో పంచాయతీ రాజ్, రోడ్లు & భవనాలు, గ్రామీణ నీటి సరఫరా శాఖ, నీటిపారుదల, జాతీయ రహదారులు, మైనర్ నీటిపారుదల, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, పబ్లిక్ హెల్త్, ఏపీ ఈడబ్ల్యుఐడీసీ, ఏపీ ఎస్పీడీసీఎల్ & ఏపీ ట్రాన్స్కో, రాయచోట మున్సిపాలిటీ, పుంగనూరు మున్సిపాలిటీ తదితర ఇంజనీరింగ్ శాఖల పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని సాగునీటి వ్యవస్థను మెరుగుపరచడానికి ఫీడర్ చానళ్లు మరియు సప్లై చానళ్లలో డీసిల్టింగ్ పనులను వేగవంతంగా చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫీడర్ చానళ్లు మరియు సప్లై చానళ్లలో పేరుకుపోయిన మట్టిని తొలగించడం ద్వారా నీటి ప్రవాహం సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే గుర్తించిన సుమారు 30కి పైగా పనులను యంత్రాల సహాయంతో త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. హెచ్‌టీ (HT) ట్యాంకులు మరియు సంబంధిత కాల్వల వద్ద రోజువారీగా డీసిల్టింగ్ పనులను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఏఈ మరియు డి ఈ స్థాయి అధికారులు రోజుకు కనీసం 3 నుండి 4 చానళ్లను తనిఖీ చేసి, పనుల పురోగతిపై స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని సూచించారు. ప్రతి కాల్వలో స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ వరకు పూర్తిస్థాయిలో డీసిల్టింగ్ పనులు చేయాలని స్పష్టం చేశారు
జాతీయ రహదారులపై సమీక్ష సందర్భంగా మదనపల్లి–పీలేరు, రాయచోటి బైపాస్ రోడ్డుకు సంబంధించిన పనులు,మదనపల్లి - బెంగళూరు రోడ్డు నిర్మాణ దశలో ఉన్న జాతీయ రహదారులకు సంబంధించిన పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. భూసేకరణకు సంబంధించిన నష్టపరిహారం చెల్లింపుల్లో ఏమైనా పెండింగ్ ఉంటే వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకంలో కేటగిరీల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని, అలాగే జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో జాతీయ మరియు రాష్ట్ర రహదారుల పనులను వేగవంతం చేయాలని తెలిపారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖపై సమీక్షిస్తూ పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న బీటీ రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణం, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద రహదారుల నిర్మాణం, ఎంపీ లాడ్స్ పథకం ద్వారా చేపట్టిన పనులు, అంగన్వాడీ కేంద్రాలు మరియు గ్రామీణ ఆరోగ్య క్లినిక్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. గ్రామీణ నీటి సరఫరా శాఖపై సమీక్ష సందర్భంగా జిల్లా పరిషత్ గ్రాంట్లు, జలజీవన్ మిషన్ తదితర పథకాల కింద జరుగుతున్న పనుల పురోగతిని అధికారులు వివరించారు. అంగన్వాడీ కేంద్రాలలో నిర్మిస్తున్న కమ్యూనిటీ పారిశుద్ధ్య కేంద్రాలు, జలజీవన్ మిషన్ పథకంలోని వాటర్ గ్రిడ్ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంకా ప్రారంభం కాని పనులను కూడా వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు
ఈ సమీక్ష సమావేశంలో పంచాయతీ రాజ్, రోడ్లు & భవనాలు, గ్రామీణ నీటి సరఫరా శాఖ, నీటిపారుదల, జాతీయ రహదారులు, మైనర్ నీటిపారుదల, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, పబ్లిక్ హెల్త్, ఏపీ ఈడబ్ల్యుఐడీసీ, ఏపీ ఎస్పీడీసీఎల్ & ఏపీ ట్రాన్స్కో, రాయచోట మున్సిపాలిటీ, పుంగనూరు మున్సిపాలిటీ తదితర ఇంజనీరింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు
Admin
Namitha News