నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఉపాధి ఉసురు తీసే విబిజీ రామ్ జి ని రద్దు చెయ్యాలి - పేదలకు వ్యవసాయ భూ పంపిణీ చెయ్యాలి - సిపిఎం జిల్లా కార్యదర్శి పి. శ్రీనివాసులు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తూ మోడీ సర్కార్ నూతనంగా తీసుకువచ్చిన విబిజి రామ్ జి చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి. శ్రీనివాసులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎం జి నేరేగా) స్థానంలో మోడీ సర్కార్ కొత్తగా తీసుకొచ్చిన వి బి -జి రాం జి 2025 (వికసిత్ భారత్-గ్యారెంటీ రోజ్ గార్ అండ్ ఆజివికా మిషన్ ( గ్రామీణ) బిల్లును సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ నేపథ్యంలో సిపిఎం పార్టీ జాతీయ నాయకత్వం దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చిన క్రమంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ధర్నా చేప్పట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి సర్కార్ దేశ స్వాతంత్రోద్యమ కాలపు జాతి నేతల పేర్లను నిస్సిగ్గుగా తొలగించేందుకు వెనకాడటం లేదంటూ మండిపడ్డారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో కొత్త చట్టం విబిజి రామ్ జి చట్టాన్ని తీసుకురావటం దుర్మార్గమన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో బిజెపి ప్రభుత్వం మహాత్ముని పై విద్వేషం వెళ్లగక్కుతుందన్నారు. మతోన్మాదం ప్రతిబింబించేలా కొత్త చట్టాలకు పేర్లు పెడుతుందన్నారు. ఇది భారత లౌకిక రాజ్యాంగానికి పూర్తి విరుద్ధమన్నారు. ఈ చర్యను బిజెపి అప్రజాస్వామిక పాలనకు పరాకాష్టగా పేర్కొనవచ్చన్నారు. వర్షాభావంతో కరువు కోరల్లో చిక్కుకున్న రైతు కూలీలకు ఉపాధి కల్పించేందుకు చేపట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బిజెపి ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చిందన్నారు. నూతన చట్టం రాష్ట్ర ప్రభుత్వాలపై అదనపు భారం మోపనుందన్నారు. మన రాష్ట్రాలు సుమారు రూ.4 వేల కోట్ల భారాన్ని మోయాల్సి వస్తుందన్నారు. 60 రోజులపాటు ఉపాధి పనులపై నిషేధం రాష్ట్రాలపై భారం వేయడంతో ఉపాధి పని రోజులు తగ్గిపోతాయన్నారు. వ్యవసాయ సంక్షోభం పెరిగి మరిన్ని ఆత్మహత్యలకు దారితీస్తుంది అన్నారు. ఓవైపు మహాత్మా గాంధీ పేరు తొలగింపు, మరోవైపు రాష్ట్రంపై అదనపు భారం పడుతున్నా.. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నోరు మెదపకపోవటం చూస్తుంటే కేంద్రం వద్ద చేతకాని పిరికిపందల్లా మారారా ? అన్నట్లు అనిపిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీల ఆగ్రహానికి గురికాకముందే నూతన చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి కోల్పోతున్న పేదలకు భూ పంపిణీ చేయడం ద్వారా మాత్రమే వలసలు నీవరించగలమని భూమి లేని పేదలను గుర్తించి వారికి భూ పంపిణీ చెయ్యాలని లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములు గుర్తించి పేదలకు పంచుతామని ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు హరిశర్మ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నాగరాజు, శేఖర్, నారాయణ, రమణ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News