నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 12 : జిల్లాలో కోడి పందేలను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం విస్తృత అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది. ఈ క్రమంలో కోడి పందేలు నిషేధం, శిక్షార్హ నేరం అనే అంశంపై రూపొందించిన అవగాహన పోస్టర్‌ను జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి , మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి తదితరులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీ ఆదర్శ్ రాజేంద్రన్ మాట్లాడుతూ కోడి పందేలు నిర్వహించడం చట్ట విరుద్ధమని, ప్రజలు ఈ అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. కోడి పందేలు వల్ల ఆర్థిక నష్టం, సామాజిక సమస్యలు తలెత్తడమే కాకుండా శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ, కోడి పందేలు వంటి అక్రమాలకు సహకరించకుండా జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కానుబిల్లి మాట్లాడుతూ..కోడి పందేలు నిర్వహించినా, ప్రోత్సహించినా, బెట్టింగ్ కార్యకలాపాలు చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండి, అక్రమ కోడి పందేలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కే. గుణశేఖర్ పిల్లె సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు
Admin
Namitha News