నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 31 : రహదారులపై భద్రతే ప్రజల జీవితాలకు మరియు కుటుంబాలకు రక్ష అని, రహదారి భద్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం మదనపల్లి బైపాస్ రోడ్డు లో పి.పి.ఆర్ ఫంక్షన్ హాల్ నందు రవాణా శాఖ ఆధ్వర్యంలో 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు సభ లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో 1989 నుండి జాతీయ రహదారి భద్రత వారోత్సవాలను జరుపుకుంటున్నామని రహదారి భద్రతపై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా శ్రద్ధ పెట్టాయన్నారు. హిట్ అండ్ యాక్సిడెంట్ పథకం 2022 క్రింద హిట్ అండ్ రన్ మోటర్ ఆక్సిడెంట్ లో చనిపోతే 2 లక్షల రూపాయల పరిహారం గాయాల పాలైన వారికి 50 వేల రూపాయల పరిహారం ఇవ్వబడుతుందన్నారు రోడ్డు ప్రమాదాలలో ప్రమాదం జరిగిన వారిని గోల్డెన్ అవర్ లో ఆసుపత్రికి తీసుకువచ్చి ప్రమాదం జరిగిన వారిని కాపాడిన వారికి 25 వేల రూపాయల నగదు బహుమతి ఇస్తున్నారని దీని ద్వారా ప్రజల్లో అవగాహన పెరిగి రోడ్డు ప్రమాదాలలో గాయపడిన వారిని రక్షించే గుణం అలవాటు అవుతుందన్నారు. రహదారి ప్రమాదాలలో గాయపడిన వారికి నగదు రహిత చికిత్స పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరియు జాతీయ ఆరోగ్య సంస్థలు సమన్వయంతో అందిస్తాయన్నారు ఈ పథకం క్రింద ప్రమాదం జరిగిన వారికి ఒక్కొక్కరికి ఏడు రోజుల లోపల ఒకటిన్నర లక్షల రూపాయలు చికిత్స నిమిత్తం అందజేయబడుతుందన్నారు. జిల్లాలో రోడ్డు భద్రతపై విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమాన్ని నెల రోజుల పాటు కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, కమర్షియల్ వాహన డ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్లు, సాధారణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. దేశంలో ఇతర వ్యాధులతో పోలిస్తే రోడ్డు ప్రమాదాల వల్లే అత్యధికంగా ప్రాణనష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గత సంవత్సరంలో దేశంలో లక్షల సంఖ్యలో ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారని, ప్రతి గంటకు సగటున 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. అన్నమయ్య జిల్లాలో సగటున ఇద్దరూ రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోతున్నారన్నారు. రోడ్డు ప్రమాదాల వలన ఒకరి నిర్లక్ష్యం వల్ల ఒక్క కుటుంబమే కాకుండా రెండు మూడు కుటుంబాలు జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. ప్రమాదాల కారణంగా శాశ్వత వికలత్వం , బ్రెయిన్ ఇంజ్యురిలు , హెడ్ ఇంజ్యురీలు జరిగి అనేక కుటుంబాల భవిష్యత్తు నాశనం అవుతోందని తెలిపారు. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను విజయవంతం చేయడానికి పోలీస్ శాఖ, రవాణా శాఖ, విద్యా సంస్థలు, ఎన్జీవోలు, పౌర వేదికలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడింగ్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. బ్రేకులు సరిగా పనిచేయని వాహనాలు, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ లేని వాహనాలతో రోడ్లపై ప్రయాణించడం ప్రమాదకరమని హెచ్చరించారు. గూగుల్ మ్యాప్స్, శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ప్రమాదాల డేటాను జియో ట్యాగ్ చేసి, ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి అవసరమైన ఇంజినీరింగ్ మార్పులు చేపడుతున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్‌లో బాధితులకు చికిత్స అందిస్తే అనేక ప్రాణాలను కాపాడవచ్చని, ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలించే వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. యువత సినిమాల్లో కనిపించే స్టంట్స్‌ను అనుకరించకుండా, రోడ్డు భద్రత నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. రోడ్డు భద్రతను గౌరవించడం ద్వారా తమ జీవితాలను మాత్రమే కాకుండా ఇతరుల జీవితాలను కూడా రక్షించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం తో ప్రారంభించి, అనంతరం వివిధ కళాశాలలో నిర్వహించిన క్విజ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు, ఏపీఎస్ఆర్టీసీ ఒకటవ డిపోకు చెందిన ఎస్.ఏ. పీర్, రెండవ డిపోకు చెందిన ఎస్ఎన్ భాష, ఎస్ ఖాదర్ వలీ ఆదిత్య కాలేజీ ఇంజనీరింగ్, పి. రాజు విశ్వం కాలేజ్, వి రాజేంద్ర మిట్స్ కాలేజీ, పి శ్రీనివాస్ వశిష్ట స్కూల్ వారికి బెస్ట్ డ్రైవర్ల గా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం అందరితో ప్రతిజ్ఞ చేయించారు
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, జిల్లా రవాణా శాఖ అధికారి ప్రసాద్, ఆర్టీవో అశోక్ ప్రతాప్ రావ్ , పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారి దయాకర్, ఎన్జీవోలు, ప్రైవేటు వాహన డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు వివిధ కళాశాలల విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News