నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బహుదా కాలువపై ఛత్రపతి విగ్రహా ఏర్పాటు సబబు కాదు - అధికారులు దీనికి అనుమతులు ఎలా ఇచ్చారు - శివాజీ విగ్రహాన్ని మరోచోట ఏర్పాటు చేయాలి - వాల్మీకి జనసైనిక్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముత్తరాశి హరికృష్ణ డిమాండ్ మదనపల్లె : అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి పట్టణ నడిబొడ్డున ప్రవహిస్తున్న బహుదా కాలువపై ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు సబబు కాదని వాల్మీకి జనసైనిక్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముత్తరాశి హరికృష్ణ పేర్కొన్నారు.శుక్రవారం చిత్తూరు బస్టాండ్ వాల్మీకి కూడలి వద్ద వాల్మీకి సంఘాల నాయకులతో కలిసి వాల్మీకి మహర్షి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ముత్తరాశి హరికృష్ణ మాట్లాడుతూ తాము చత్రపతి శివాజీకి,ఆ కులానికి వ్యతిరేకం కాదన్నారు.నాడు శివాజీ మొగల్ చక్రవర్తులతో పోరాటం చేసే రోజుల్లో బోయ భీమన్న ఆయనకు చేదోడు,వాదోడుగా నిలిచారని గుర్తుచేశారు.అయితే బహుదాకాలువపై అక్రమ కట్టడాలు నిర్మించరాదని ప్రభుత్వం స్పష్టమైన జీవో ఇచ్చిందని,అయితే ఛత్రపతి విగ్రహ ఏర్పాటుకు ఎవరు అనుమతులు ఇచ్చారని సూటిగా ప్రశ్నించారు.బహుదా కాలువ మొత్తం 25 చెరువులతో అనుసంధానం కలిగి ఉందని 1996 జూన్ 14న ఆకస్మిక వరదలు సంభవించడంతో సుమారు 30 వాల్మీకి కుటుంబాలు గల్లంతయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని అక్కడి నుండి మరోచోటికి తరలించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి,రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి,జిల్లా కలెక్టర్,మున్సిపల్ అధికారులకు వాల్మీకి సంఘాలు వినతి పత్రాలు సమర్పించడం జరిగిందన్నారు.కొన్ని దశాబ్దాలుగా వాల్మీకి కూడలిగా ఇది ప్రసిద్ధిగాంచిందన్నారు.అయితే వాల్మీకుల తెలియజేస్తున్న నిరసనలను కొందరు అధికారులు తేలికగా తీసుకుంటున్నారని,వారు తేరుకోకపోతే మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు.అదేవిధంగా కూటమి పార్టీల నాయకులు స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని,లేనిపక్షంలో వాల్మీకులు వారికి దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఇప్పటికైనా దీనిపై అధికారులు,ప్రభుత్వ పెద్దలు స్పందించి చత్రపతి శివాజీ విగ్రహాన్ని మరోచోటి ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘాల నాయకులు పూలకుంట్ల హరిబాబు,మేకల విజయ మోహన్,విష్ణు చైతన్య,వేణు,రామకృష్ణ,నరసింహ,శంకర,రాజేష్,తేజ సూరి తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News