నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కలకడ - జనవరి 08 : పట్టాదారు పాసుపుస్తకం లోని క్యూఆర్ కోడ్ ద్వారా భూ యజమాని మరియు భూమి వివరాలు సులభంగా తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం ఉదయం కలకడ మండలం దేవలపల్లి గ్రామంలోని గ్రామ సచివాలయంలో నిర్వహించబడిన పట్టాదారు పారసీ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.... జిల్లాలో నిర్వహించబడుతున్న రెవెన్యూ గ్రామ సభలలో... రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో కలిగిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రిసర్వే కార్యక్రమంలో అధునాతన సాంకేతికత ద్వారా భూ సమస్యలను మరియు వివాదాలను పరిష్కరించగలుగుతామన్నారు. ఈ అధునాతన సాంకేతికతతో సెంటీమీటర్ కూడా తేడా జరగకుండా రి సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. అధునాతన సాంకేతికత ద్వారా రైతుకు ఎంత భూమి ఉంది, ఎక్కడ ఉంది తదితర అంశాలను చాలా స్పష్టంగా మరియు సులభంగా గుర్తించగలుగుతామన్నారు. రెవెన్యూ గ్రామ సభలను సచివాలయ స్థాయిలో నిర్వహిస్తున్నామని ప్రజలందరూ ఈ కార్యక్రమాలను వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్.. పలువురు లబ్ధిదారులతో... పట్టాదారు పాసుపుస్తకం లో సరైన వివరాలు నమోదు చేసి ఉన్నారా లేక ఏమైనా తప్పులు ఉన్నాయా, ఆధార్ నెంబరు సరిగా ఉందా వంటి పలు ప్రశ్నలను అడగగా సరైన వివరాలను చేర్చి ఉన్నారని లబ్ధిదారులు సమాధానం ఇచ్చారు. పట్టాదారు పాస్ పుస్తకాలలో తప్పులు దొర్లితే వెంటనే పరిష్కరించాలని మండల తాసిల్దారును ఆదేశించారు. మండల తాసిల్దార్ మహేశ్వరి మాట్లాడుతూ... నూతన పట్టాదారు పాసు పుస్తకాలను లబ్ధిదారు కానీ లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చి పాత పుస్తకాన్ని ఇచ్చి నూతన పట్టాదారు పాసు పుస్తకాన్ని తీసుకోవచ్చని సూచించారు. నూతన పట్టాదారు పాసుపుస్తకం లోని క్యూఆర్ కోడ్ను ఏ విధంగా వినియోగించుకోవాలి అనే అంశంపై పాసుపుస్తకాలు తీసుకోవడానికి వచ్చిన లబ్ధిదారులకు కూలంకషంగా వివరించారు. ఆధార్ నెంబరు ఫోన్ నెంబరు మరియు ఇతర వివరాల్లో తప్పులుంటే వెంటనే అర్జి పెట్టుకొని పరిష్కరించుకోవచ్చని సూచించారు
Admin
Namitha News