నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - జనవరి 06 : రోడ్డు భద్రత అనేది కేవలం ఒక నిబంధన కాదు, అది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా (జనవరి 01 నుండి 31 వరకు), మంగళవారం రాయచోటి పట్టణంలో హెల్మెట్ ధారణ ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ జిల్లా ఎస్పీ గారు స్వయంగా హెల్మెట్ ధరించి భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ కడప రింగ్ రోడ్ వద్ద ప్రారంభమై, శివాలయం చెక్ పోస్ట్ మీదుగా బంగ్లా వరకు ఉత్సాహంగా సాగింది. పోలీసు అధికారులు, సిబ్బంది, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, విద్యా సంస్థల ప్రతినిధులు మరియు పట్టణ బైక్ మెకానిక్స్ పెద్ద సంఖ్యలో పాల్గొని రోడ్డు భద్రతా నినాదాలతో ప్రజల్లో చైతన్యం నింపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ ద్విచక్ర వాహన ప్రమాదాల్లో జరిగే మరణాలలో అధిక శాతం తలకు గాయాలు కావడం వల్లే జరుగుతున్నాయి. ఐఎస్ఐ (ISI) ముద్ర కలిగిన హెల్మెట్ ధరిస్తే ప్రాణాపాయం నుండి 80% పైగా తప్పించుకోవచ్చు. అతివేగం ఆపదకు మూలమని, యువత అత్యుత్సాహంతో బైక్ రేసింగ్‌లు చేసి విలువైన ప్రాణాలను బలి తీసుకోవద్దని కోరారు. మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడటం చట్టరీత్యా నేరమని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ప్రమాదాల నివారణకు గాను, హెల్మెట్ ధరించని వాహనదారులకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపకూడదనే నిబంధనను కచ్చితంగా అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ యం. వెంకటాద్రి గారు, రాయచోటి డిఎస్పీ యం.ఆర్. కృష్ణమోహన్ గారు, ట్రాఫిక్ సి.ఐ. కులాయప్ప, రాయచోటి పట్టణ మరియు రూరల్ సి.ఐలు చలపతి, రోషన్, లక్కిరెడ్డిపల్లి సి.ఐ. కృష్ణంరాజు నాయక్, ఎం.వి.ఐ. సుబ్బరాయుడు, పలువురు ఎస్.ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Namitha News