నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లాను పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి: అన్నమయ్య జిల్లాను పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపునిచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మదనపల్లి గ్రామీణ మండలం కోళ్లబైలు పంచాయతీ సచివాలయం వద్ద నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి లక్ష్మీనరసయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఎంఎస్‌ఓతో కలిసి పలువురు చిన్నారులకు ఎమ్మెల్యే పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తూ, పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ఆదివారం, సోమవారం, మంగళవారం మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆదివారం పోలియో చుక్కలు వేయించుకోలేని వారు సోమవారం లేదా మంగళవారం తప్పనిసరిగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించి పోలియో మహమ్మారి నుంచి రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసులు నాయుడు, మోహన్ రెడ్డి, రమేష్ రెడ్డి, బాలమాది శేఖర్, శ్రీనాథ్, జేసీబీ వేణు, అనంత, టీబీ విభాగ అధికారి ప్రభాకర్, సచివాలయ సిబ్బంది, ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News