నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి : జనవరి 12: రాయచోటిలోని పోలీస్ పరేడ్ మైదానంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి , వారి సతీమణి శ్రీమతి ఉమా శ్రీ లక్ష్మీ లు కలిసి ముఖ్య అతిథులుగా హాజరై భోగి మంటలు వెలిగించి వేడుకలను ఘనంగా ప్రారంభించారు. నిత్యం కవాతులు, శిక్షణలతో కనిపించే పోలీస్ మైదానం, సంక్రాంతి సందడితో ఒక్కసారిగా పల్లెటూరి వాతావరణాన్ని తలపించింది
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, సంక్రాంతి అనేది ఒక కులానికో, మతానికో పరిమితమైన పండుగ కాదని, ఇది శ్రమజీవులైన రైతుల పండుగ అని కొనియాడారు. కష్టపడి పండించిన పంట చేతికి వచ్చిన శుభవేళ, అందరూ కలిసి ఆనందాన్ని పంచుకునే గొప్ప సందర్భమని పేర్కొన్నారు. ఇలాంటి వేడుకలు పోలీసు సిబ్బందిలో విధి నిర్వహణలో కలిగే ఒత్తిడిని తగ్గించి, మానసిక ఉల్లాసాన్ని, నూతనోత్సాహాన్ని నింపుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎస్పీ గారు ఆదేశించారు. స్టేషన్‌కు వచ్చే పేదలు, మహిళలు, వృద్ధులు మరియు బడుగు బలహీన వర్గాల పట్ల అత్యంత మానవీయంగా వ్యవహరించాలి. పండుగ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని, చట్టాన్ని అతిక్రమించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. వేడుకల్లో భాగంగా మహిళా పోలీసులు మరియు పోలీసు కుటుంబ సభ్యులు వేసిన రంగవల్లులు (ముగ్గులు) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముగ్గుల పోటీలను ఎస్పీ గారి సతీమణి శ్రీమతి ఉమా శ్రీ లక్ష్మీ గారు ప్రారంభించి, విజేతలను ఎంపిక చేశారు. మ్యూజికల్ చైర్స్, డ్రాయింగ్ పోటీలు, తంబోలా, గోళీలు, బొంగరాల వంటి ఆటలు నిర్వహించారు. ఎస్పీ దంపతులు స్వయంగా పిల్లలతో కలిసి గాలిపటాలు ఎగురవేసి, అందరిలో ఉత్సాహాన్ని నింపారు. వేడుకల చివరలో వివిధ పోటీల్లో పాల్గొన్న సిబ్బందికి మరియు వారి పిల్లలకు ఎస్పీ దంపతులు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్‌ఐలు వి.జె.రామకృష్ణ, ఎం.పెద్దయ్య, ఇతర పోలీస్ అధికారులు, మహిళా పోలీసులు, హోంగార్డులు మరియు పోలీస్ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగను చిరస్మరణీయం చేశారు.
Admin
Namitha News