నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 02 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రం లోని పంచాయితీ పారిశుద్ధ్య, పంప్ ఆపరేటర్లు పనులు ఆపేయడంతో తంబళ్లపల్లె ఒక్క రోజుకే కంపు కొడుతుంది. గత మూడు మాసాలుగా పంచాయతీ కార్మికులకు జీతాలతో పాటు మరమ్మత్తుల బిల్లులు చెల్లించకపోవడంతో మండల స్థాయి అధికారులు, పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోలేదు. దీంతో విసిగి వేసారిన పారిశుద్ధ కార్మికులు పారిశుద్ధ్యపు పనులతో పాటు తాగునీటి సరఫరా సైతం ఆపేయడంతో తంబళ్లపల్లె ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల స్థాయి అధికారులకు మొరపెట్టుకున్న వారు కుంటి సాకులు చెబుతూ దాటవేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి మంగళవారం సెలవు పై వెళ్లడంతో వారి సమస్య పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. తంబళ్లపల్లె మండల కేంద్రంలో ప్రతిరోజు సుమారు ఐదు ట్రాక్టర్ల చెత్తాచెదారం తరలించాల్సి ఉండగా ఎక్కడికక్కడ చెత్త పేరుకు పోతోంది. మురికి నీటి కాలువలు శుభ్రం చేయకపోవడంతో దుర్గంధం తో ముక్కు పగిలేలా దుర్వాసన కొడుతోంది. ఉదయం నుండి నీటి సరఫరా లేకపోవడంతో ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మధ్యకాలంలో జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ అధికారులు ఇంటింటికి తిరిగి ప్రజల వద్ద అన్ని రకాల పన్నులు ముక్కు పిండి వసూలు చేశారు. అయితే ప్రజల మౌలిక సదుపాయాలు ,సమస్యల పట్ల నిర్లక్ష్యంతో పట్టించుకోకపోవడం పై ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పంచాయతీలో నిధులు ఉన్నా చెల్లించడానికి కుంటి సాకులు చెప్పడం ఏంటని ప్రజలు నిలదీస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేసి పారిశుద్ధ్యపు పనులు, నీటి సరఫరా చేయకపోతే తంబళ్లపల్లెలో పారిశుధ్యం లోపించి స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కాదు స్వచ్ఛ చెత్త కుప్పల కేంద్రంగా నిలవడం ఖాయం
Reporter
Namitha News