నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నవంబర్ 28: 33 ఏళ్లుగా తమ అనుభవంలో ఉన్న భూమికి పట్టా ఇవ్వాలని అడిగిన రైతు పై వీఆర్వో వేధింపులకు పాల్పడడంతో ఆ రైతు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం గుర్రంకొండ మండలంలో జరిగింది. బాధిత రైతు కుమారుడు ఆదినారాయణ రెడ్డి కథనం మేరకు.. గుర్రంకొండ మండలం, వెల్లుట్ల గ్రామం, ఇ పసలవాండ్ల పల్లెకు చెందిన వెంకటరమణారెడ్డి గ్రామంలోని సర్వే నంబర్ 421 లో 1.5 ఎకరా పొలాన్ని గత 33ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆ స్థలానికి పట్టా ఇవ్వాలని పలుసార్లు అధికారులను ఆశ్రయించాడు. అయితే అధికారులు కాలయాపన చేస్తూ వచ్చారు. మరోసారి ఈ నెల 17న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కు సదరు అనుభవంలో ఉన్న భూమికి పట్టా ఇవ్వాలని అర్జీ పెట్టుకున్నాడు. దీంతో స్పందించిన కలెక్టర్ విచారణ చేసి బాధితునికి పట్టా ఇవ్వాలని తహసిల్దార్ కు పంపారు. విచారణ చేసి పట్టా ఇచ్చేలా చూడాలని స్థానిక వీఆర్ఒ సదశివా నాయుడు ను ఆదేశించారు. దీంతో విఆర్వో భూమిని పరిశీలించి తనకు రూ.50 వేలు ఇస్తే త్వరగా పట్టా వచ్చేలా చూస్తానని చెప్పాడు. అయితే తమకు అంత స్తోమత లేదని కరుణించి ఈ పేద రైతుకు పట్టా ఇవ్వాలని రైతు వెంకటరమణా రెడ్డి కాళ్లా వేళ్లా పడినా కనికరించిన విఆర్వో పట్టా ఇవ్వకపోగా ఈ భూమిని ఖాళీ చేయాలని హెచ్చరించాడు. దీంతో రైతు వీఅర్ఒ ముందే పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే బాధితున్ని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గుర్రంకొండ పోలీసులు విచారణ చేస్తున్నారు.
Reporter
Namitha News