నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : టీబీ ముక్త్ భారత్ అభియాన్, డెంగీ మాసోత్సవాలను విజయవంతం చేద్దాం: డిప్యూటీ హెచ్‌ఈఓ మహమ్మద్ రఫీ / గుర్రంకొండ: టీబీ ముక్త్ భారత్ అభియాన్, డెంగీ మాసోత్సవాలు, స్టాప్ డయేరియా కార్యక్రమాలు, జనాభా దినోత్సవ వారోత్సవాలను ప్రజల భాగస్వామ్యంతో ప్రభావితం విజయవంతం చేయాలని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ పిలుపునిచ్చారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు గుర్రంకొండ మండలం తరిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మర్రిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మర్రిపాడు సచివాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులు, ప్రజలకు డెంగీ, క్షయవ్యాధి, అతిసార వ్యాధులు, జనాభా సమతుల్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహమ్మద్ రఫీ మాట్లాడుతూ, టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి పొగాకు, మద్యం అలవాట్లు ఉన్నవారు, గతంలో టీబీ బారినపడి కోలుకున్నవారు, హెచ్‌ఐవీ బాధితులు, గర్భిణులు, మధుమేహం, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారిని గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. క్షయవ్యాధి నిర్ధారణ అయిన వారికి ఆరు నెలలపాటు ఉచిత చికిత్సతో పాటు ప్రతి నెల రూ.1,000 చొప్పున పౌష్టికాహారం కోసం ప్రభుత్వం అందజేస్తోందని చెప్పారు. టీబీ రోగులకు పౌష్టికాహారం అందించేందుకు 'పోషణ్ మిత్రలు' ముందుకు రావాలని కోరారు. జూలై నెలను డెంగీ వ్యతిరేక మాసోత్సవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రతి శుక్రవారం 'డ్రై డే' పాటించాలని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, నీటి నిల్వలను మూతలతో కప్పివేయడం, కిటికీలకు మెష్ అమర్చడం, సాయంత్రం వేళ పచ్చి వేపాకు పొగ వేయడం, కాలువల్లో చెత్త వేయకుండా ఉండడం ద్వారా దోమల వ్యాప్తిని నివారించవచ్చని వివరించారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత, చేతుల శుభ్రత, మరుగుదొడ్ల వినియోగం, ఓఆర్‌ఎస్ వినియోగంపై కూడా అవగాహన కల్పించారు. జనాభా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా అర్హులైన దంపతులకు కుటుంబ నియంత్రణ తాత్కాలిక పద్ధతులపై అవగాహన కల్పిస్తూ, పిల్లల మధ్య తగిన వ్యవధి పాటించడం ద్వారా ఆరోగ్యకరమైన, సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మించవచ్చని సూచించారు. అనంతరం నినాదాలతో ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెచ్‌ఈఓ మహమ్మద్ రఫీ, ఎమ్‌పీహెచ్‌ఈఓ హరినాథ్, పర్యవేక్షకురాలు సుజాత, ప్రధానోపాధ్యాయురాలు అరుణ, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News