నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఉపాధి హామీ రికార్డులను సక్రమంగా నిర్వహించాలి: -- ఉపాధి సిబ్బంది పనితీరు మార్చుకోవాలి -- పనిలో అలసత్వం వహిస్తే చర్యలు -- డ్వామా పీడి వెంకటరత్నం నిమ్మనపల్లి: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, ఉద్యోగులు పొరపాటులను సరిదిద్దుకొని క్రమశిక్షణతో పని చేయాలని డ్వామా పీడి వెంకటరత్నం తెలిపారు. ఆదివారం డ్రామా ఏపిడి శ్రీనివాసులు, ఎంపీడీఓ ఫక్రుద్దీన్ సాహెబ్, జిల్లా ఆంబూడ్స్ మెన్ శ్రీనివాసులు తో కలసి స్థానిక ఉపాధి హామీ భవనం ఆవరణంలో 2024-25 సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మండల వ్యాప్తంగా వివిధ శాఖలలో 865 పనులకు రూ.4,80,28,346/- కోట్ల లను ఖర్చు చేసిన దానిపై 19వ సామాజిక తనిఖీ బహిరంగ ప్రజా వేదిక సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా డ్వామా పీడి వెంకటరత్నం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2024-25 లో ఎంజిఎన్ఆర్ఈజీఎస్ ద్వారా 802 పనులకు రూ.3,10,88,072/- లతో చేసిన ఉపాధి హామీ పనులను, ఎంజిఎన్ఆర్ఇజిఎస్ ద్వారా పంచాయతీరాజ్ శాఖలో 63 పనులకు రూ.1,69,40,274/- లతో చేసిన పనులను మొత్తంగా 865 పనులకు రూ.4,80,28,346/- లతో చేసిన పనులను సామాజిక తనిఖీ బృందం ప్రతి పంచాయతీలోనూ ప్రతి పనిని క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించి వాటిలోని లోపాలను గుర్తించడం జరిగిందన్నారు. అనంతరం స్థానిక పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఇంజనీరింగ్ సహాయకులు, ఉపాధి హామీ సిబ్బంది, రైతులతో కలసి సామాజిక తనిఖీ బృందం ప్రతి పంచాయతీలోనూ గ్రామ సభను ఏర్పాటు చేసి పరిశీలించిన పనుల స్థితిగతులను ప్రజలతో చర్చించడం జరిగిందన్నారు. దీనిపై ఆదివారం సామాజిక తనిఖీ ప్రజావేదికను ఏర్పాటు చేసి బహిరంగంగా ప్రజలకు వివరించామన్నారు. ఇందులో ఉపాధి హామీ క్షేత్రస్థాయి సిబ్బందిలో, టెక్నికల్ అసిస్టెంట్ ల నిర్లక్ష్యం కారణంగా కొన్ని లోపాలను గుర్తించినట్లు వివరించారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేసిన పనులలో, తనిఖీ బృందం గుర్తించిన పనులలో తేడాలను గుర్తించామన్నారు. పనుల గుర్తింపు, పనుల ప్రారంభం, పని పూర్తి, వేతనాలు చెల్లింపు లకు సంబంధించిన రికార్డులు సక్రమంగా లేవని అన్నారు. కొన్ని పంచాయతీలలో ఉద్యానవన పంటల సాగులో చేపట్టిన పనులకు గుంతలు తీసి మొక్కలను నాటకుండా ఉండటాన్ని, నాటిన మొక్కలను సంరక్షించకుండా వదిలివేయడాన్ని గుర్తించారన్నారు. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను వెంటనే నాటించాలని ఆదేశించామన్నారు. రూ.16,500/- లను పెనాల్టీ గా వేసినట్లు తెలిపారు. టెక్నికల్ అసిస్టెంట్, ఇతర సిబ్బంది క్రమశిక్షణ రహితంగా ఉన్నారని, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ఉపాధి హామీ సిబ్బందికి వారి విధులపై కనీసం అవగాహన లేకపోవడంతో ఆగ్రహించి సిబ్బంది పనితీరు మార్చుకోవాలని లేనిపక్షంలో తాము తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారి పనితీరు మెరుగుపరుచుకునేలా చర్యలు తీసుకోవాలని ఏపీఓ రమేష్ కు సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం వహించవద్దని, పొరపాట్లు పునరావృతం కాకుండా సరిదిద్దుకోవాలని ఉపాధి హామీ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపిడి శ్రీనివాసులు, ఎంపిడిఓ ఫక్రుద్దీన్ సాహెబ్, ఏపీఓ రమేష్, ఎస్ఆర్పి సూర్యచక్రం, డిఆర్పీలు దిలీప్ కుమార్, ప్రతాప్, రాజు నాయక్, జేఈ బోయకొండప్ప, టిఏ లు పద్మావతి, ఉపాధి హామీ పథకం క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News