నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వర్షపు నీటి ప్రతి బొట్టును ఒడిసిపట్టాలి జిల్లాలో జల వనరుల పెంపుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలి : కలెక్టర్ నిశాంత్ కుమార్ చెరువులు, కుంటలు, రిజర్వాయర్ల నింపుదలపై ప్రత్యేక దృష్టి అన్నమయ్య జిల్లాలో రానున్న వర్షాలను సమర్థవంతంగా వినియోగించుకుని జల వనరుల పెంపు దిశగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం మదనపల్లి కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన ప్రత్యేక అధికారులు, డ్వామా, ఇరిగేషన్, సాగునీటి శాఖ ఏఈలు, ఏపీడీలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జల వనరుల పరిరక్షణ, వర్షపు నీటి నిల్వ, ప్రవాహాల మళ్లింపు, చెరువుల పునరుద్ధరణ అంశాలపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కార్యాచరణ ప్రణాళికలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ ఏడాది సాధారణం కంటే సుమారు ఐదు శాతం అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని తెలిపారు. ఇప్పటికే పలు మండలాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయని, రానున్న రోజుల్లో మరింత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గత ఏడాది నీటి మట్టాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈసారి భూగర్భ జలాల పెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రస్తుతం కురుస్తున్న తొలి వర్షాలను చెరువులు, కుంటలు, ఎంఐ ట్యాంకుల్లో నిల్వ చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కొన్ని చెరువులు ఇప్పటికే 20 నుంచి 25 శాతం వరకు నిండటం సానుకూల పరిణామమన్నారు. ప్రధాన నదుల్లో పూర్తి స్థాయి ప్రవాహాలు ప్రారంభమయ్యే వరకు చిన్న వాగులు, స్ట్రీమ్స్, సీజనల్ వాటర్ ఛానల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వృథాగా వెళ్లిపోతున్న నీటిని చెరువులు, ట్యాంకులు, రిజర్వాయర్లకు మళ్లించడం ద్వారా తాగునీరు, సాగునీటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ట్యాంక్ టు ట్యాంక్ కనెక్టివిటీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొంటూ ఫీడర్, లింక్ ఛానల్స్ అభివృద్ధి ద్వారా వరుసగా పలుచెరువులు నింపే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మండలంలో ప్రధాన వాగులు, వాటి ప్రవాహ సామర్థ్యంపై పూర్తి స్థాయి మ్యాపింగ్ సిద్ధం చేయాలని సూచించారు. జిల్లాలో తాగునీటి అవసరాలు, భూగర్భ జలాల పెంపు, సాగునీటి భద్రత దృష్ట్యా ప్రతి అధికారి బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. సమన్వయంతో పని చేస్తే ఈ ఏడాది జల వనరులను గణనీయంగా పెంచే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, ఆర్డీవో శ్రీనివాస్, రిటైర్డ్ ఇరిగేషన్ ఎస్సీ వెంకట్రామయ్య, ఎంపీడీవోలు, డ్వామా, ఇరిగేషన్, సాగునీటి శాఖ ఏఈలు, ఏపీడీలు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News